పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. ఓవైపు ప్లంబర్ గా పని చేస్తూ.. ఇంకోవైపు కష్టపడి ప్రాక్టీస్ చేసి రంజీకి సెలెక్ట్ అయ్యాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలో పనులు చేయడం.. మధ్యాహ్నం నుంచి గ్రౌండ్ లో కష్టపడడం.. అతడి రోజువారీ దినచర్య. వచ్చేవారం అహ్మదాబాద్ లో జరగనున్న రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో ఒడిశాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ ప్లేయర్ పేరు ప్రశాంత్ రానా.
రానా ఊరు నయాగఢ్ జిల్లాలోని మాదాపూర్ అనే మారుమూల ప్రాంతం. తండ్రి గ్రామంలోని శివాలయంలో పూజారి. అన్నయ్య వ్యవసాయ కూలీ. ఓవైపు ప్లంబర్ పని చేసుకుంటూ ఇంకో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రానా. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. క్రికెట్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. ఉదయం పదో తరగతి ఫైనల్ పరీక్ష రాసి.. మధ్యాహ్నం టోర్నమెంట్ ఆడడానికి వెళ్లాడు.
2012లో భద్రతా చర్యలను తనిఖీ చేయడానికి ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి చేరాడు. నెలవారీ సంపాదన రూ.14,000. భువనేశ్వర్ లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు సమయం ఉంటుందని భావించి అందులో చేరాడు. కానీ.. సమయం అంతా ఉద్యోగానికే సరిపోయేది. తర్వాత దాన్ని వదిలేశాడు. కుటుంబసభ్యులు నెలకు 2వేలు పంపిస్తుంటే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. కొన్నాళ్లకు తండ్రి క్షయ వ్యాధి బారిన పడడంతో వస్తున్న కొంత డబ్బు కూడా రావడం కష్టమైంది. దీంతో రోజుకు రూ.210కు ఓ ప్లంబర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు రానా. అయితే.. తనకు సగం జీతం చాలని మధ్యాహ్నం నుంచి క్రికెట్ ఆడేందుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరాడు.
అదృష్టవశాత్తూ కటక్ లోని యూనియన్ స్పోర్టింగ్ క్లబ్ లోని క్రికెట్ కోచ్ ప్రదీప్ చౌహాన్ మార్గదర్శకత్వంలో ప్రశాంత్ రానా ఆటలో మెలకువలు తెలిశాయి. వరుసగా క్లబ్ స్థాయి క్రికెట్ మ్యాచ్ లు ఆడిన తర్వాత నయాగర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. కలహండి కప్ లో జిల్లా జట్టుకు కెప్టెన్ గా కొనసాగాడు. రానా బాగా హైట్ ఉండడంతో బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చాడు. అక్టోబర్ 2021లో రాష్ట్ర స్థాయిలో సెలెక్టర్లను ఆకర్షించాడు. ఒడిశా రంజీ జట్టుకు ఎంపికయ్యాడు.