దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకా వేయనున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. కరోనా జాగ్రత్తలపై ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 2022కు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఉత్సాహంగా స్వాగతం చెప్పడంతోపాటు జాగ్రత్తలు కూడా ముఖ్యమని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోందన్న ప్రధాని.. దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెప్పారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సిజన్ పడకలు, కోటీ 40 లక్షల ఐసీయూ బెడ్స్, చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. దేశంలో కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. కరోనా అంతానికి వ్యాక్సిన్ తయారీ, అప్రూవల్, సరఫరా యుద్ధప్రాతిపదికన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 90 శాతం మందికి తొలి డోసు పూర్తయిందన్న మోడీ.. త్వరలోనే నాసల్, డీఎన్ఏ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అహర్నిశలు పని చేస్తున్నామన్నారు ప్రధాని. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోందని.. హెల్త్ వర్కర్స్ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఒమిక్రాన్ వస్తోందని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని.. మాస్కులు ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు ప్రధాని మోడీ.