యూకేలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వింద్యా రాణి దేవీ రజత పతకం గెలిచారు. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
ఈ నేపథ్యంలో ఆమెను ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ఈ సాఫల్యం ఆమె దృఢత్వానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. ఆమె విజయం ప్రతి భారతీయుడిని ఎంతో సంతోషపెట్టిందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్వీట్ లో తెలిపారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో వెయిలిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో రజతం గెలుచుకున్నారు. 112 కిలోల క్లీన్ అండ్ జర్క్ విభాగంలో విఫలం అయ్యారు.
దీంతో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంటారని అంతా భావించారు. కానీ ఫైనల్ లో 114 కిలోలు లిఫ్ట్ చేసి రెండో స్థానానికి చేరుకున్నారు. ఆమె కన్నా ఒక కేజీ అధికంగా లిఫ్ట్ చేసి నైజీరియాకు చెందిన అడిజాట్ ఒలారినోయే స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు.