ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే లో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం 246 కి.మీ. ఢిల్లీ-దౌసా-లాల్ సోత్ సెక్షన్ ను ప్రారంభించారు. రాజస్థాన్ లోని దౌసా నుంచి ఈ కొత్త సెక్షన్ ని లాంచ్ చేయడం వల్ల ఢిల్లీ నుంచి జైపూర్ కు ప్రయాణ సమయం 5 గంటల నుంచి సుమారు మూడున్నర గంటలు తగ్గుతుంది. ఈ సెక్షన్ ఓపెనింగ్ సందర్భంగా రిమోట్ తో మోడీ బటన్ నొక్కారు. రూ. 12, 150 కోట్ల వ్యయంతో డెవలప్ చేసిన ఈ సెక్షన్ కారణంగా ఈ మొత్తం ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
. అలాగే దౌసా నుంచి 18, 100 కోట్లు ఖర్చు కాగల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించారు. ఇంకా రూ. 5,940 కోట్ల వ్యయంతో 247 కిలోమీటర్ల దూరం వరకు సాగనున్న జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘న్యూ ఇండియా’ నినాదంలో భాగంగా ఆయన రోడ్డు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పీఎంఓ వెల్లడించింది. కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్ ప్రెస్ వే ..ఆరు రాష్ట్రాలను.. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలను కలుపుతుంది.
కోట, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ వంటి నగరాలను కూడా ఈ సెక్షన్ ‘దగ్గర చేస్తుంది’ . పైగా 13 పోర్టులు, 8 పెద్ద ఎయిర్ పోర్టులు మరో 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల సృష్టికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ నూతన సెక్షన్ ని మోడీ లాంచ్ చేసిన సందర్భంగా రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్ లో తన సీఎం కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనగా… హర్యానా సీఎం ఖట్టర్.. నూహ్ జిల్లాలో జరిగిన ఈవెంట్ లో దీనికి హాజరయ్యారు.
1386 కిలోమీటర్ల ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే తొలిదశలో నిర్మించిన ఈ విస్తృత రహదారి వల్ల పోర్టులు, రైల్వేలు, ఎయిర్ పోర్టుల నిర్మాణానికి భారీ పెట్టుబడులు వస్తాయని మోడీ తెలిపారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడితే అది చిన్న వ్యాపారులకు, పరిశ్రమలకు బలం చేకూరుస్తుందన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే తొలిదశను జాతికి అంకితం చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కోసం 10 లక్షల కోట్లను కేటాయించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. 2014తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తమ నినాదమని పేర్కొన్నారు. 8 లేన్ల సోహ్నా-దౌసా జాతీయ రహదారిపై యావత్ ప్రపంచ నిర్మాణరంగం ఆసక్తిగా చూస్తోంది.