– భారత్..ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి
– రైల్వేస్టేషన్ లో చాయ్ అమ్మిన పిల్లవాడు…
– దేశ ప్రధాని కావటమే అందుకు నిదర్శనం
– భిన్నత్వంలో ఏకత్వం..నాదేశం ఘనత
– ఏకాత్మ మానవవాదం మా సిద్ధాంతం
– వందేళ్లలో కనివినీ ఎరగని కరోనా మహమ్మారి
– ప్రపంచానికి వ్యాక్సిన్ అందించాం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిందన్న మోడీ..దేశంలోని వైవిధ్యమే ప్రజాస్వామ్యపు పునాదులను పట్టిష్టపరిచిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలనుద్దేశించి ప్రసంగించిన మోడీ ప్రస్తుతం కరోనా పరిస్థితులను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ..బాల్యంలో రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఒక పిల్లవాడు..ఇవాళ దేశానికి ప్రధాని హోదాలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్నాడనగానే హర్షధ్వానాలు మార్మోగాయి.ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని… సమాజంలో ప్రతీ వ్యక్తి సంతోషంగా ఉండాలనేదే భారతీయ తత్వమని అన్నారు.
అటు.. వందేళ్లలో ఎన్నడూ చూడనంత విపత్తును కరోనా తీసుకువచ్చిందని..ఈ సంక్షోభ సమయంలోనూ తాము దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇచ్చామని వెల్లడించారు.కరోనా వేళ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించామని వివరించారు.కరోనా సమయంలో తాము తీసుకువచ్చిన కొవిన్ యాప్ అద్భుతంగా పనిచేసిందని చెప్పారు.ఇక భారత్ అనేక డిజిటల్ సంస్కరణలు తీసుకొచ్చిందని..ఇవి ప్రపంచ గతినే మార్చుతాయన్న నమ్మకం తనకుందన్నారు మోడీ.
మరోవైపు..ఉగ్రవాద నిర్మూలన..కరోనా నివారణ..పెట్టుబడులు..ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం మెయిన్ అజెండాగా భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన కొనసాగింది.అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ తో, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో భేటీ సందర్భంగా వీటిపైనే ప్రధానంగా చర్చలు జరిపారు మోడీ.
ఇక..ఐరాస ప్రసంగంలో భారత్ లో భూ రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదన్నారు. గ్రామాలు అభివృద్ధి అయినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని వివరించారు. భారత్ లో 6 లక్షల గ్రామాల్లో డ్రోన్లతో మ్యాపింగ్ చేశామని.. భారతీయుల ప్రగతి ప్రపంచ వికాసానికి దోహదం చేస్తుందని చెప్పారు మోడీ.
ఇక బైడెన్ తో భేటీ సందర్భంగా కీలక విషయాలపై చర్చలు జరిపారు మోడీ. వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతం, రక్షణ భాగస్వామ్యంపై మాట్లాడుకున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై చర్చించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. మానవరహిత విమానాల కోసం భారత్, అమెరికా మధ్య కుదిరిన 22 బిలియన్ డాలర్ల ఒప్పందం గురించి వివరించింది. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.
మోడీ అమెరికా పర్యటనలో మరో కీలక అంశం.. భారత్ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం. ఈ విషయంలో భారత్ కు తమ సహకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లోకి భారత్ ప్రవేశం విషయంలో కూడా సపోర్ట్ ఉంటుందని హామీఇచ్చారు. కమలా హ్యారిస్ తో భేటీలో కూడా ఉగ్రవాదంపై ప్రముఖంగా మాట్లాడారు మోడీ. ఉగ్రవాద సంస్థలతో ఇటు అమెరికా, అటు భారత్ కు శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని దీనిపై కఠినంగా ఉండాలని చర్చించారు.
Advertisements
క్వాడ్ దేశాల మీటింగ్ లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే వ్యూహాలపై మాట్లాడుకున్నారు నాలుగు దేశాల అధినేతలు. అందరం భాగస్వామ్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అంతకుముందు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు, పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు మోడీ. భారత్ లో పెట్టుబడుల అంశంపై చర్చలు జరిపారు.