భారత్ లోని ప్రతి మూల నుంచి ఉత్పత్తులు ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఆర్థిక అభివృద్ధి దిశగా భారత్ గొప్ప చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.
మన్ కీ బాత్ కార్యక్రమం 87వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ఆదివారం ప్రసంగించారు. భారత ఉత్పత్తులను ప్రపంచంలోని నలు మూలలకు, నూతన మార్కెట్లకు ఎగుమతి చేయాల్సిన అవసరం గురించి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ చేరుకుందని, ఇది మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఎగుమతులు పెరిగాయంటే భారత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు.
ప్రస్తుతం చిన్న దుకాణ దారులు సైతం తమ వస్తువులను ప్రభుత్వానికి జీఈఎమ్ పోర్టల్ పై విక్రయించ వచ్చన్నారు. పెద్ద లక్ష్యాలు ఉండటం కాదు వాటిని చేరుకునేందుకు గొప్ప ధైర్యాన్ని చూపాలన్నారు.
బాబా శివానంద్ గురించి ఈ సందర్బంగా ప్రస్తావించారు. 126 ఏండ్ల వృద్ధుడి వేగాన్ని చూసి, తన లాంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారని అన్నారు. బాబా శివానంద్ ఆయన వయస్సు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఫిట్‌గా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా మంది చేసిన వ్యాఖ్యలను తాను చూశానని చెప్పారు.
నీటి కొరత ఎక్కువగా ఉన్న రాష్ట్రం నుంచి తాను వచ్చానని తెలిపారు. గుజరాత్ లో బావులను వావ్ అంటారని చెప్పారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో వావ్ పెద్ద పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాంటి వావ్ లను సంరక్షించడంలో జల్ మందిర్ పథకం ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.
పలు భాషల్లో, పలు మాండలికాల్లో తనకు ప్రేక్షకుల నుంచి మెసేజ్ వస్తు్నాయని, మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇదొక అందమైన విషయమన్నారు. భారత సంస్కృతి, మన భాషలు, మన మాండలికాలు, మనం జీవించే విధానం, మనం తీసుకునే ఆహారం, భిన్నత్వాలు మనకు ఉన్న గొప్ప బలం అన్నారు.