అమూల్ పాల ధరలు పెరిగాయి. అన్ని రకాల పాలపై ధర రూ.3 పెంచుతున్నట్టు అమూల్ పాలను మార్కెటింగ్ చేసే సంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. గుజరాత్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది.
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. పాల ధరల పెంపుతో సామాన్యుడిపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. మోడీజీ, అమిత్ షాజీలు పాలు తాగరు కదా అని ఎద్దేవా చేశారు. కానీ మన పిల్లలకు పాలు తాగడం తప్పనిసరి కదా అని ఆయన అన్నారు.
పాల ధరలను పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్పష్టం చేసిందన్నారు. లీటర్ పాలపై రూ. 3 పెంచితే మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో తెలుసా అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఒక వేళ మీ కుటుంబం రోజుకు 2 లీటర్ల పాలు తాగితే ఇక నుంచి రోజుకు రూ. 6 అధికంగా చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.
ఇక నెల మొత్తానికి రూ. 180 లను, ఏడాదికి రూ. 2160లను అధనంగా మీ కుటుంబం భరించాల్సి వస్తుందన్నారు. ఇది అమృత కాలమా? లేదా రికవరీ కాలమా? ఈ ప్రశ్న మీకు మీరే వేసుకోండి అని చెప్పింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అమూల్ పాలపై రూ. 8 పెరిగినట్టు కాంగ్రెస్ పేర్కొంది. మంచి రోజులు అంటే ఇవే అనుకుంటా అని వ్యంగ్యస్త్రాలు సంధించింది.