సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సాయం
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కొందరు మృతి చెందారని, కొంతమంది గాయపడ్డారని తెలిసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఈ పరిహారాన్ని ఆయన ప్రకటించారు.
సికింద్రాబాద్ లోని రూబీ ఎలెక్ట్రిక్ బైక్స్ షో రూమ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ షో రూమ్ పై గల లాడ్జిలో బస చేసిన వారిలో కొందరు మంటల తాలూకు దట్టమైన పొగల కారణంగా ఊపిరాడక మరణించినట్టు తెలుస్తోంది. రూబీ షో రూమ్ ని, లాడ్జిని పోలీసులు సీల్ చేశారు. బిల్డింగ్ అనుమతులు, తదితరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా షో రూమ్ నిర్వహణ
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి.. ఈ షో రూమ్ యజమాని రంజిత్ సింగ్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఈ షో రూమ్ నిర్వహిస్తున్నాడన్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న స్థానిక ఎస్సై.. అప్పటికే ముగ్గుర్ని రక్షించాడని ఆమె చెప్పారు. యశోదా ఆసుపత్రిలో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్టు ఆమె తెలిపారు. మృతుల్లో నలుగురి డెడ్ బాడీలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు ఆమె వెల్లడించారు. ప్రమాద కారణాలపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందన్నారు.