ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో తొలి సారిగా దళాధిపతిగా మహిళా ఆఫీసర్ శివ చౌహన్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగిన విషయమని ఆయన కొనియాడారు.
ఇది భారత నారీ శక్తి స్ఫూర్తిని ఇది వివరిస్తుందని ఆయన అన్నారు. ఆమె ఆర్మీలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన వారు. ఆమె తాజాగా రక్షణ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు సియాచిన్ యుద్ధ పాఠశాలలో ఆమె కొన్ని నెలల పాటు కఠోర శిక్షణ పొందారు.
ప్రపంచంలో ఎత్తైన క్షేత్రంగా గుర్తింపు పొందిన సియాచిన్‌లో అత్యంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతిరోజూ అధిక మంచు కురుస్తుంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ విధులు నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 15,632 అడుగుల ఎత్తులో ఉంటుంది.
అత్యంత కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న శివ చౌహాన్ ను కుమార్ పోస్ట్ వద్ద నియమించినట్టు ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ ఇటీవల ట్విట్టర్‌లో ప్రకటించింది. కెప్టెన్ శివ చౌహాన్ స్వస్థలం రాజస్థాన్. 11ఏండ్ల వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయారు. దీంతో కుటుంబ బాధ్యతలను ఆమె తల్లి చూసుకున్నారు.
భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలన్న శివ కోరిక మేరకు ఆమె సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణా అకాడమీలో ఆమె ట్రెయినింగ్ పొందారు. అసాధరణ ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించడంతో సియాచిన్ లో బ్యాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపికయ్యారు. .