ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం తొలగించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం మోడీ అస్సాంలోని డిఫులో వెటరినరీ కళాశాలకు, వెస్ట్ కర్బి అంగ్‌లాంగ్‌లో డిగ్రీ కళాశాలకు, కోలోంగలో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా పాల్గొన్నారు. అనంతరం కర్బి అంగ్‌లాంగ్‌లోని డిఫులో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సభ’ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు.
ఇటీవల అస్సాంలోని 23 జిల్లాల నుంచి సాయుధ దళాల చట్టాన్ని తొలగించాని, మెరుగైన శాంతి భద్రతల ఫలితంగానే ఇది సాధ్యమైందని మోడీ చెప్పారు. గత 8 ఏళ్లలో ఇక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. అలాగే, డబుల్ ఇంజిన్ల ప్రభుత్వాలను మోడీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ స్ఫూర్తితో సరిహద్దు సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నామన్నారు.
అలాగే, ఇటీవల అసోం, మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతర రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. శాంతి, అభివృద్ధి కోసం గత ఏడాది కర్బి అంగ్‌లాంగ్ నుంచి అనేక సంస్థలు దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చాయని మోడీ చెప్పారు. బోడో ఒప్పందం 2020లో శాశ్వత శాంతికి నూతన ద్వారాలను తెరిచిందన్నారు.
‘అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. రూ.1000కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభివృద్ధి, నమ్మకమే మా విధానం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ లక్ష్యంతోనే ముందుకుసాగుతున్నాం. అసోంలోని 23 జిల్లాలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్‌పీఏ) తొలగించాం. ఈశాన్యంలో శాంతి భద్రతలు మెరుగపడినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తితోనే సరిహద్దు సంబంధిత సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నాం. అసోం, మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులనూ ప్రోత్సహిస్తుంది. అసోంను శాశ్వతంగా శాంతియుత రాష్ట్రంగా మారుస్తాం.’ అని మోడీ చెప్పారు.