– అల్లూరి విగ్రహావిష్కరణలో మోడీ
యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని మోడీ. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెద్ద అమిరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు పాల్గొన్నారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ… తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అని మాట్లాడారు. అల్లూరి మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు అని కొనియాడారు. రంప ఆందోళన ప్రారంభించి వందేళ్లు పూర్తయిందని.. మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగిందని తెలిపారు. అంతకుముందు అల్లూరి కుటుంబసభ్యులను సత్కరించిన మోడీ.. వారితో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని.. యావత్ భారత్ తరఫున ఆయన పాదాలకు వందనం చేస్తున్నానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి అని.. ఇలాంటి ప్రాంతానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకేసిందని అన్నారు. లక్షలమంది త్యాగాల ఫలితమే ఇవాళ్టి భారతదేశమని చెప్పారు. ఆనాటి పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి అని కొనియాడారు. ఆయన ఘనతను గుర్తుంచుకునే జిల్లాకు పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.
స్వాతంత్య్రం కోసం పోరాడిన సమర యోధులను స్మరించుకోవడం కోసం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి 125 వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారని వివరించారు.