ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ విషయంలో ప్రధాని మోడీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గలిగిన నేతగా నిలిచారు. సర్వేలో 78 శాతం మంది ప్రధాని మోడీకే తమ ఓటు వేశారు.
మొత్తం 22 దేశాలకు చెందిన ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారి నుంచి పలు అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రధాని మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత స్థానంలో స్విస్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ ఉన్నారు. 2023 జనవరి 26 నుంచి 31వ తేదీల మధ్య సర్వే నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వేలో సేకరించిన తాజా డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది.
లోపెజ్ ఒబ్రాడర్ కు 68 శాతం ఓట్లు లభించినట్టు సర్వే పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇద్దరికి సమాన ఓటింగ్ వచ్చింది. ఇద్దరికి 40 శాతం చొప్పున ప్రజాదరణ వచ్చింది. భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు కేవలం 30 శాతం ప్రజాదరణ లభించడం గమనార్హం.