ప్రధాన మంత్రుల సంగ్రహాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగ్రహాలయ సందర్శన కోసం మొదటి టికెట్ ను ఆయన కొన్నారు.
ఈ మ్యూజియం 14 మంది భారత మాజీ ప్రధానులు చేసిన సేవలను మనకు చూపిస్తుంది. వివిధ సంక్షోభ సమయాల్లో వారు భారత్ ను ఎలా నడిపించారో మనకు వివరిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఇక ఈ సంగ్రహాలయ సందర్శనకు టికెట్ ఆన్ లైన్ లో రూ. 100 గాను, ఆఫ్ లైన్ లో రూ. 110 గా ఉంది. విదేశీయులకు మాత్రం టికెట్ ధర రూ. 750గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
5 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. పాఠశాల, కాలేజీ విద్యార్థులకు 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు వివరించారు.
న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంగ్రహాలయాన్ని రూ.271 కోట్లతో నిర్మించారు. మన మాజీ ప్రధాన మంత్రులకు సంబంధించిన పలు అరుదైన ఫోటోలు, వీడియోలు, వారికి వచ్చిన బహుమతులు మొదలైనవాటిని ప్రదర్శనకు ఉంచారు.