ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని ప్రధాని మోడీ అన్నారు. దేశాలను విభజించే అంశాలపై కాకుండా వాటిని కలిపే అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రపంచం విచ్చిన్నం అవుతున్న సమయంలో ఈ జీ20 సదస్సు జరుగుతోందన్నారు. అందువల్ల అన్ని దేశాల చూపు జీ20 సమావేశాలపైనే ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం హర్యానాలోని గురుగ్రామ్‌లో జరుగుతోంది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదంతో సమావేశాలు ఈ నెల 1 నుంచి 4 వరకు సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచ దేశాలు విభజించే వాటిపై కాకుండా అందరినీ ఏకం చేసే అంశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ విషయంలో గాంధీ, బుద్ధుడు ప్టుట్టిన ఈ భారత నాగరికత నుంచి ప్రేరణ పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయని అన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మనమంతా కలుస్తున్నామని చెప్పారు. గత కొన్నేండ్లుగా ఆర్థిక సంక్షోభం, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాల వంటి పలు సంక్షోభాలను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయన్నారు.
ముఖ్యంగా పలు దేశాల తలెత్తిన వివాదాలు, ఉద్రిక్తతలు ఎలా పరిష్కరించాలనే విషయంపై మనందరికీ ఆలోచనలు ఉన్నాయన్నారు. వృద్ధి, అభివృద్ధి,ఆర్థిక స్థిరత్వం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం, అంతర్జాతీయ నేరాలు, అవినీతి వంటి సవాళ్లను తగ్గించేందుకు ప్రపంచం ఇప్పుడు జీ20 దేశాల వైపు చూస్తోందన్నారు. ఈ అన్ని రంగాల్లో ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, కచ్చితమైన ఫలితాలు సాధించగలిగే సామర్థ్యం జీ20కు ఉందన్నారు.
మరోవైపు ఐరాస లాంటి బహుళపక్ష సంస్థల తీరుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విమర్శలు గుప్పించారు. ఆయా సంస్థలు ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండటం లేదన్నారు. ఇది ఇలానే కొనసాగుతూ పోతే ఆ సంస్థలపై విశ్వసనీయత మరింత సన్నగిల్లుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా యూఎన్ఓ ప్రమాణాలు లేవన్నారు. ఇవి ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రమాణాలన్నారు. అప్పటితో పోలీస్తే సభ్యదేశాల సంఖ్య 4 రెట్లు పెరిగిందన్నారు. ఇవి ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. వీటిలో మార్పులు తీసుకు రావాలంటూ 2005 నుంచి పలు దేశాల నంచి డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదన్నారు.