రష్యా-ఉక్రెయిన్ మధ్య యుధ్ధాన్ని ఆపడం భారత ప్రధాని మోడీకే సాధ్యమవుతుందని అమెరికా వ్యాఖ్యానించింది. ఈ వార్ ఆగిపోవడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా తాము స్వాగతిస్తామని వైట్ హౌస్ నేషనల్ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి ఈ వార్ ను ఆపవచ్చునని, కానీ ఆయన ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. పుతిన్ ఇప్పటికైనా ఈ వార్ ను ఆపవచ్చునన్నారు.
ఈ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ఆగిపోవాలని తాము కోరుతున్నామన్నారు. మాస్కోలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. పుతిన్ తో సమావేశమైన నేపథ్యంలో జాన్ కిర్బీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న జటిల పరిస్థితికి పుతిన్ ఒక్కడే కారకుడని, వార్ ని ఆపివేసే బదులు ఆయన మిసైళ్లను ప్రయోగిస్తూ ఉక్రెయిన్లను మరింత కష్టాల పాలు చేస్తున్నాడని కిర్బీ ఆరోపించారు.
యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేయవలసిందంతా చేస్తున్నారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పై దురాక్రమణను నిలిపివేయమని పుతిన్ ని ఒప్పించే శక్తి మోడీకి ఉంది అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇక మాస్కోలో పుతిన్ తో భేటీ అయిన అజిత్ దోవల్.. భారత, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతం పైన, ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితుల పైన చర్చించారు. ఢిల్లీలో జీ-20 దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం మరికొన్ని వారాల్లో జరగనుండగా.. అజిత్ దోవల్ రష్యాను సందర్శించారు.