భారత రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పార్లమెంట్ హాల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని మోడీ. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు ఓటు వేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు కూడా ఓటు వేశారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో తొలి ఓటు వేశారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు రోజా, తానేటి వనిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య 4,800. గ్రీన్ బ్యాలెట్ పేపర్ లో ఎంపీలు, పింక్ పేపర్ లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేస్తున్నారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.