దేశంలో చీలికలు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అలాంటి ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ లోని కరియప్ప గ్రౌండ్స్ లో శనివారం జరిగిన నేషనల్ కేడెట్ కోర్స్ ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. ఈ దేశ యువత కారణంగానే ప్రపంచ దేశాలన్నీ ఇండియావైపు చూస్తున్నాయన్నారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించిఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇండియాలో మళ్ళీ చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని, ఇందుకు ఎన్నో సాకులను వేలెత్తి చూపుతున్నాయని చెప్పారు.
కానీ వాటి ప్రయత్నాలు విఫలమవుతాయన్నారు. భారత ప్రజలు సమైక్యతా మంత్రాన్నే ఆలపిస్తున్నారని, వారిలో ఎవరూ చీలికలు తేజాలరని అన్నారు. ‘తల్లి పాలలో ఎవరూ విషం కలపజాలరన్నారు. యువత ప్రయోజనాలకోసం తమ ప్రభుత్వం డిజిటల్, స్టార్టప్ ల వంటి పలు విప్లవాత్మక పథకాలను, కార్యక్రమాలను చేబడుతోందని మోడీ చెప్పారు.
దేశయువత తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దుకునేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. సమైక్యత అన్నది మన అంతిమ లక్ష్యమని, ఇదే ఇండియాను బలోపేతం చేస్తుందని, ఈ మంత్రంతోనే మనం ముందుకు సాగుదామని మోడీ పేర్కొన్నారు.
రక్షణ రంగంలో చేబట్టిన సంస్కరణల గురించి ఆయన వివరిస్తూ ఇటీవలి వరకు మనం అసాల్ట్ రైఫిల్స్ ను దిగుమతి చేసుకునేవారమని, కానీ ఇప్పుడు ఇవి మన దేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. ఇలాగే ఇంకా పలు రక్షణ వ్యవస్థలు ఇండియాలో తయారవుతున్నట్టు ఆయన చెప్పారు. ఎన్ సీ సీ ని లాంచ్ చేసి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా రూ. 75 నాణేన్ని విడుదల చేశారు.