కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. రైతు వ్యతిరేకులు మాత్రమే కొత్త చట్టాలను నిరసిస్తున్నారని మండిపడ్డారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చామని.. ఫలితంగా అధిక ధరకే అమ్మే అవకాశం ఉంటుందన్నారు.
కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచాలన్న స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదన అమలు చేశామని స్పష్టం చేశారు మోదీ. గతంలో విపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవని, కానీ ప్రస్తుతం వదంతులే ప్రతిపక్షాలకు ఆధారమయ్యాయంటూ విమర్శించారు. తమ నిర్ణయాలు బాగున్నా.. వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కొత్త మార్కెట్ విధానంతో సాంప్రదాయ మండీలకు ఎటువంటి నష్టం ఉండదని, కనీస మద్దతు ధర కూడా మారదని పునరుద్ఘటించారు.