కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప తో ప్రధాని మోడీ సుమారు 15 నిముషాలు మాట్లాడడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా యడ్యూరప్పను పక్కకు పిలిచి మోడీ కొద్దిసేపు మాట్లాడారంటే ‘ఏదో లేకపోలేదని’ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాదిన కర్ణాటక ఒక్కటే బీజేపీ పాలిత రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్ లలో యడ్యూరప్పకు మంచి పేరుంది. ఈ వర్గంలో ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఉన్నారు.
జరగబోయే ఎన్నికల్లో వీరి ఓట్లు బీజేపీకి చాలా కీలకం. తనను సీఎం పదవి నుంచి పార్టీ తప్పించాక.. యడ్యూరప్ప రాష్ట్ర రాజకీయాల్లో అంటీముట్టనట్టుగా ‘లో ప్రొఫైల్’ మెయింటెయిన్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో బాహాటంగా పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. అయినా బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్టీ పార్లమెంటరీ బోర్డులో ఆయనను అధిష్టానం సభ్యుడిని చేసింది. ఇప్పుడు ప్రధాని మోడీ ప్రత్యేకంగా యడ్యూరప్పతో మాట్లాడడం చూస్తే తిరిగి కర్ణాటకలో ఆయన హవా మొదలవుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
పైగా ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం పట్ల బీజేపీ అధిష్టానం కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ గత ఏడాది విపక్షాలు పెను దుమారాన్నే సృష్టించాయి. ‘పే సీఎం ‘క్యాంపెయిన్ నిర్వహించాయి. అవినీతిని బొమ్మై అదుపు చేయలేకపోతున్నారని ఆరోపణలు గుప్పించాయి.
అయితే రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండదని బీజేపీ స్పష్టం చేసింది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. కానీ అసెంబ్లీ లోని 224 స్థానాలకు గాను మనం 136 సీట్లను గెలవాలన్న ‘మిషన్ 136’ ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా .. ఆయనకు ‘టార్గెట్’ విధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని ‘పోరు’కు రెడీగా ఉన్న తరుణంలో బొమ్మైకి ఇది కష్ట సాధ్యమే కావచ్చు.