పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజున రాజ్యసభ చైర్మన్ గా జగదీప్ దన్కడ్ తొలిసారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సభ తరఫున ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా ప్రజాస్వామ్య విలువలను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పరిరక్షిస్తారని మోడీ అన్నారు.
దేశంలో ఎంతో మందికి దన్ ఖడ్ స్ఫూర్తి అంటూ మోడీ కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థవంతంగా నిర్వర్తించారంటూ తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ఓ రైతుబిడ్డ ఎన్నికవడం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు.
దన్ ఖడ్ కు న్యాయవాదిగా మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందన్నారు. ఆయనకు న్యాయ పరమైన అంశాలపై గొప్ప పరిజ్ఞానం ఉందని మోడీ వెల్లడించారు. భారత్ అమృత్ కాల్ ప్రయాణం, జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మోడీ పేర్కొన్నారు.
అనంతరం ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణకు రాజ్యసభలో నివాళులర్పించారు. అటు లోక్‌సభలోనూ వీరికి నివాళులర్పించారు. అనంతరం దిగువసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.