హాలీవుడ్ లో ఆస్కార్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డయిన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ రెండు విభాగాల్లో నామినేట్ అయి ..’నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా మోత మోగించింది. టాలీవుడ్ ని మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. ఈ సాంగ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కి హాలీవుడ్ జేజేలు పలకక తప్పలేదు. ఇక దీని గురించి ఎంత పొగిడినా తక్కువే..
ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన కీరవాణి పేరు అనౌన్స్ వీడియోను షేర్ చేస్తూ.. ఇది మొత్తం ఇండియాకే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇది చాలాప్రత్యేకమైన పురస్కారమని, కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలని అన్నారు.
అలాగే రాజమౌళి, ఎన్ఠీఆర్,చరణ్, మొత్తం సినీ యూనిట్ కంతా కంగ్రాట్స్.. అని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వపడేలా చేస్తుంది. అని మోడీ అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇది ఇండియాకు గర్వకారణమన్నారు.
ఇప్పుడు చాలా హ్యాపీ.. రాహుల్ సిప్లి గంజ్
నాటు నాటు సాంగ్ కి ఈ అవార్డు దక్కడంపై ఈ పాట సింగర్లలో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ సంతోషం వ్యక్తం చేస్తూ .. గల్లీ నుంచి వచ్చిన తన పేరు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై వినిపించడం జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. అలాగే చంద్రబోస్ కూడా ఇవి ఆనంద క్షణాలని పేర్కొన్నారు.