కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. భూముల్ని లాక్కుంటారని రైతులని భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండో విడత నిధులని విడుదల చేసిన అనంరతం.. రైతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో భూములు తీసుకుంటారని కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధం చెప్తున్నాయని.. రైతులు ఎవరూ వారి భూముల్ని కోల్పోరని ప్రధాని స్పష్టం చేశారు. డైరీ సెక్టార్‌లో ఇప్పటికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉందని గుర్తు చేసిన ప్రధాని.. ఎప్పుడైనా ఎవరైనా రైతు తన భూమి పోయిందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయే కానీ.. ఏనాడు వాటిని అమలు చేసింది లేదని మండిపడ్డారు. రాజకీయ పార్టీల కారణంగా పేద రైతు మరింత పేదగా మారుతున్నాడని ప్రధాని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. రైతుల నిరసనల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు విమర్శించారు.
ప్రస్తుత కాలంలో ఏ పంటకు ఎక్కడ రేటు ఎక్కువ ఉందని రైతుల తెలుసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని.. రైతులు ఎక్కడికైనా వెళ్లి తమ పంటను అమ్ముకునే వెసలుబాటు కల్పిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. రైతులు తమను ఎంత వ్యతిరేకిస్తున్నా సరే.. వారితో చర్చలు జరిపేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగానే ఉంటామని మోదీ తెలిపారు.