కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం పేరుకే తప్ప వాస్తవంలో లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. జమ్మూకశ్మీర్ ప్రజల కోసం సేహత్ స్కీమ్‌ను ప్రారంభించిన ఆయన.. వర్చువల్ విధానంలో మాట్లాడారు.
కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకే ఇటీవల డీడీసీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఓటేశారని గుర్తు చేసిన ప్రధాని..అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాంటి వాళ్లు తనకు ప్రజాస్వామ్యంపై పాఠాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలను నిర్వహించకుండానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్రపతిని కలిసి రాహుల్ బృందం.. అనంతరం మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో ప్రజాస్వామ్యం లేదని రాహుల్ మండిపడ్డారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న వారిని ప్రభుత్వం ఉగ్రవాదులగా ముద్ర వేస్తోందని.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఉగ్రవాది అంటూ మోదీ ఆరోపించినా ఆశ్చర్యం లేదని రాహుల్ సెటైర్ వేశారు. దానికి తాజాగా ప్రధాని కౌంటర్ ఇచ్చారు.