మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని వెల్లడించారు. మహిమాన్విత వారసత్వంతో కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో మొధేరా యావత్ దేశానికి ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.
అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగసభలో ప్రధాని ప్రసగించారు. గతంలో విద్యుత్ లేకపోవడంతో చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేదని.. ఇప్పుడు సౌర విద్యుత్ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్.. కార్లు, మెట్రోకోచ్ లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. విమానాలను తయారు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు.
నీరు, విద్యుత్ లభ్యత యువతకు విద్య, వృద్ధులకు వైద్య సదుపాయాలు, వ్యవసాయంలో మార్పులు, కనెక్టివిటీని పెంచేందుకు తగిన మౌలికవసతులు కల్పన.. ఈ స్తంభాలపై గుజరాత్ ను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు మోడీ. గుజరాత్ పర్యటన సందర్భంగా రూ.14,600కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని.