ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి వెయ్యి రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చారు. బీజేపీని మరింత బలోపేతం చేయాలని.. దేశ అభివృద్ధికి పాటు పడాలని పార్టీ కార్యకర్తలను కోరారు. తను ఇచ్చిన విరాళం పే స్లిప్ తన ట్విట్టర్ ఖాతాలో మోదీ షేర్ చేశారు. “భారతీయ జనతా పార్టీ కోసం వెయ్యి రూపాయలు అందిస్తున్నాను. దేశం మొదటి స్థానంలో ఉండటానికి ఎప్పుడు పార్టీ కృషి చేస్తుంది. దేశానికి నిస్వార్థ సేవ చేయడానికి మీ యొక్క విరాళం మా క్యాడర్ కు ఉపయోగపడుతుంది. బీజేపీకి మద్దతుగా నిలిచి దేశాన్ని బలోపేతం చేయండి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
బీజేపీ విరాళాల సేకరణ కోసం మైక్రో డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోని ప్రతి కార్యకర్త నుంచి రూ. 5 నుంచి రూ. 1,000 వరకు విరాళాలు స్వీకరిస్తున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్థంతి అయిన ఫిబ్రవరి 11 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు బీజేపీ తెలిపింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా 1,000 రూపాయలు విరాళం అందించారు. బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు బాధ్యతగా సహకారం అందిస్తున్నానని తెలిపారు. రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో మీతో పాటు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయవచ్చని కార్యకర్తలకు సూచించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న బీజేపీని మరింత శక్తివంతం చేయవచ్చని నడ్డా ట్వీట్ చేశారు.