రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
దేశంలో కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ ఉండేది కాదనీ, సిక్కుల ఊచ కోత జరిగి ఉండేది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాన చర్చలో మంగళవారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
‘ కొందరు దేశంలో కాంగ్రెస్ లేకుంటే ఏం జరిగేదని అడుగుతున్నారు. వారికి నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒక వేళ దేశంలో కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చి ఉండేది కాదు. దేశంలో అసలు కుల రాజకీయాల మాటే ఉండేది కాదు. పెద్ద ఎత్తున్న సిక్కులు ఊచకోతకు గురయ్యే వారు కాదు. కశ్మీరి పండితులకు సమస్యలు ఏర్పడకపోయేవి” అని అన్నారు.
కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలపై మాట్లాడిన ఆయన.. వారసత్వ రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ కు ఉన్న సమస్య ఏంటంటే ఆ పార్టీ తన వంశాన్ని మించి ఆలోచించలేదు. ఎప్పుడైతే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు మొదట ప్రమాదానికి గురయ్యేది ప్రతిభావంతులే అని తెలిపారు.
‘ మహత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండి ఉండేది కాదు. అప్పుడు బంధుప్రీతి నుంచి మన ప్రజాస్వామ్యం విముక్తి పొంది ఉండేది. దేశం స్వదేశీ మార్గంలో ప్రయాణించేది. దశాబ్దాల అవినీతి కొనసాగకపోయేది. ప్రాథమిక సౌకర్యాల కోసం సామాన్యుడు సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడేది కాదు” అని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా… దేశాన్ని కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించిందని, ఈ విషయాన్ని బోధకులు మరచి పోయారని రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు.