ప్రపంచంలోనే అతి భారీ నదీ విహారి ‘ఎంవీ గంగా విలాస్’ క్రూజ్ నౌక కదిలింది. వారణాసిలో ప్రధాని మోడీ శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఇక్కడినుంచి ప్రారంభమైన దీని ప్రయాణం 51 రోజులపాటు 3,200 కి.మీ. సాగి బంగ్లాదేశ్ ద్వారా అస్సాం లోని దిబ్రూగఢ్ చేరుకుంటుంది. రెండు దేశాల్లోని 27 నదీమార్గాల ద్వారా ఈ నౌక సాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ..గంగానదిపై ప్రారంభమైన ఈ జలవిహారి ప్రయాణం ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైనదని, ఇదొక మైలురాయిని అభివర్ణించారు. ఇండియాలో టూరిజానికి ఇది ఓ కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.
దీనితో బాటు ఈ రోజు వెయ్యి కోట్లకు పైగా విలువైన పలు ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. తూర్పు భారతంలో ఇవి వాణిజ్యాన్ని, టూరిజాన్ని పెంపొందించడానికి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి తోడ్పడతాయన్నారు. వారణాసిలో గంగానది తీర ప్రాంతంలో ‘టెంట్ సిటీ’ ని కూడా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఇక ఎంవీ గంగా విలాస్ నౌక.. వాల్డ్ హెరిటేజ్ సైట్లు, నేషనల్ పార్కులు, నదీ ఘాట్లతో బాటు 50 టూరిస్టు స్పాట్లను విజిట్ చేస్తుంది. బీహార్ లోని పాట్నా, ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్, బెంగాల్ రాజధాని కోల్ కతా, అస్సాం కేపిటల్ గౌహతి, బంగ్లా రాజధానిని కూడా ఈ క్రూజ్ ‘సందర్శిస్తుంది’.ఇండియా, బంగ్లాదేశ్ లలో మొత్తం 5 రాష్ట్రాల గుండా ఇది సాగుతుంది. అత్యంత విలాసవంతమైన 18 సూట్లలో 80 మంది ఇందులో ప్రయాణించవచ్చు. గంగా నదితో బాటు మేఘ్నా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా గంగా విలాస్ ప్రయాణిస్తుంది.
ఇక ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ధరలు అబ్బో అనేలా ఉంటాయి. ఈ క్రూజ్ ని ఆపరేట్ చేసే కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చునట. ఇందులో ఒక్కో వ్యక్తికి ఒక రోజుకు రూ. 24,692. 25 ఛార్జ్ చేస్తారని కేంద్ర రేవులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. భారతీయులకు, విదేశియులకు కూడా ఈ చార్జీలు ఇంతే ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తం 51 రోజులకు ఛార్జి రూ. 12.59 లక్షలవుతుందన్నారు.