ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ ని, దేశ రాజధాని ఢిల్లీని కలుపుతున్న తొలి సెమి హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ వర్చ్యువల్ గా గురువారం ప్రారంభించారు. ఈ కొత్త రైలు సర్వీసు ఈ నెల 29 నుంచి రెగ్యులర్ గా ప్రారంభం కానుంది. మీరట్, ముజఫర్ నగర్, సహరన్ పూర్, రూర్కీ, హరిద్వార్ మీదుగా ఈ ట్రెయిన్ 302 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, ప్రయాణ సమయం 4 గంటల 45 నిముషాలని రైల్వే వర్గాలు తెలిపాయి.
బుధవారాలు తప్ప వారంలో మిగిలిన అన్ని రోజులూ ఈ రైలు నడుస్తుందని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. ఇండియావైపు అన్ని దేశాలూ ఎంతో ఆశగా చూస్తున్నాయని, మన దేశ ప్రగతిని, సామర్థ్యాన్ని అవగాహన చేసుకోజూస్తున్నాయని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాలకు వందే భారత్ రైళ్ల వంటివి ఎన్నో మంచి అవకాశాలను కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రారంభించిన రైలు ఢిల్లీ లోని ఆనంద్ విహార్ టర్మినల్ వరకు ప్రయాణిస్తుంది. వివిధ మార్గాల నుంచి ఢిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలిది. ఇప్పటివరకు ఢిల్లీకి అజ్మీర్, వారణాసి, కత్రా, భోపాల్, అంబ్ అందౌరాల ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ రైళ్లతో అనుసంధానించారు. ఇక ఉత్తరాఖండ్ మొదటి వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు ఇండియాలో 18 వది.
8 కోచ్ లు గల ఈ ట్రెయిన్ రెగ్యులర్ సర్వీసు 29 నుంచి ప్రారంభమవుతుందని, డెహ్రాడూన్ నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం లోగా అంటే 11.45 గంటలకు ఆనంద్ విహార్ టర్మినల్ చేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే అక్కడి నుంచి సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.35 గంటలకు డెహ్రాడూన్ చేరుతుందన్నారు.