పరీక్షలను పండుగలాగా విద్యార్థులు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ పరీక్షా పే చర్చా ‘ ఐదవ ఎడిషన్ లో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రధాని శుక్రవారం మాట్లాడారు.
ఇది తనకు ప్రత్యేక కార్యక్రమమని, కానీ కొవిడ్ సంక్షోభం వల్ల విద్యార్థులతో మాట్లాడలేకపోయానని తెలిపారు. రాబోయే పండుగల నేపథ్యంలో విద్యార్థులందరికీ మోడీ శుభాకాంక్షలు చెప్పారు.
పరీక్షలు ఉన్నప్పుడు మనం పండుగలను ఎంజాయ్ చేయలేమన్నారు. కానీ పరీక్షలను పండుగలాగా ఫీల్ అయినప్పుడు తప్పకుండా పర్వదినాలను మనం ఎంజాయ్ చేయగలమని పేర్కొన్నారు.
‘ మీరు ఇప్పటికే ఎన్నో పరీక్షలను రాశారు. ఇప్పుడు ముగింపు పరీక్షను రాయబోతున్నారు. అలాంటప్పుడు భయం ఎందుకు. మీరు ఇప్పటికే సప్త సముద్రాలు దాటారు. ఇప్పుడు చిన్న పిల్ల కాల్వను చూసి భయపడటం ఎందుకు’ అని విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు.
‘ మీలో చాలా మంది కొంత సిలబస్ ను ప్రిపేర్ కాకపోయి ఉండవచ్చు. అలా అని భయపడటం మంచిది కాదన్నారు. మీరు కొంత సిలబస్ మిస్ చేసి ఉంటారు. అలాంటప్పుడు మీరు పూర్తి చేసిన సిలబస్ పైన విశ్వాసం ఉంచండి. ఇది పరీక్షల సమయంలో భయాన్ని అధిగమించడానికి ఉపకరిస్తుంది’ అని అన్నారు.