కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత గులాంనబీ ఆజాద్ కు ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభ వేదికగా సెల్యూట్ చేశారు. ఏప్రిల్ లో పదవీకాలం ముగుస్తున్న సభ్యుల వీడ్కోలు చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఆజాద్ సేవలను గుర్తు చేస్తూ… దేశానికి ఆయన ఎంతో చేశారని, అలాంటి తను పదవీకాలం ముగిసి వెళ్లిపోతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
ఆజాద్ లాంటి వ్యక్తి పనితీరును సభలో మరొకరితో పూడ్చలేమని, ఆయన తన పార్టీతో పాటు దేశం గురించి కూడా ఆలోచన చేస్తూ ముందుకు సాగారని సెల్యూట్ చేశారు. తను రిటైర్ అవుతున్నారని అనుకోవద్దని… తన సేవలను కచ్చితంగా వాడుకుంటామని ప్రధాని మోడీ రాజ్యసభలో వెల్లడించారు.
గతంలో జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు ఉగ్రవాద దాడిలో గుజరాతీయులు గాయపడితే… ఒకటికి రెండుసార్లు తనే స్వయంగా నాతో టచ్ లో ఉండి… ఓ కుటుంభ సభ్యుడిగా ప్రతిస్పందించారని గుర్తు చేశారు.
గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో కాంగ్రెస్ తరుపున ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏప్రిల్ తో ముగియనుంది.