టర్కీ భూకంపంపై ప్రధాని మోడీ తీవ్రంగా చలించిపోయారు. ఈ ఘోర కలికి వేలమంది ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది గాయపడ్డారని చెప్పిన ఆయన ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యారు. టర్కీతో బాటు సిరియాలో కూడా భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందన్నారు. ఆ దేశాలకు భారత ప్రభుత్వం చేయవలసిన సాయమంతా చేస్తుందని ఆయన చెప్పారు.
ఈ రకమైన భూకంప తాకిడిని ఒకప్పుడు గుజరాత్ లోని భుజ్ లో కూడా తాను చూశానని, టర్కీ, సిరియాలలో సంభవించిన పెను ఉపద్రవం నాటి భుజ్ పరిస్థితిని గుర్తుకు తెచ్చిందని ఆయన చెప్పారు. మంగళవారం పార్లమెంటులో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎంతో భావోద్వేగానికి గురయ్యారని ఆ తరువాత పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు.
గుజరాత్ లోని పరిస్థితిని చెబుతూ మోడీ కంటతడి పెట్టారని, లోగడ గుజరాత్ సీఎంగా ఉండగా 2001 లో ఆ రాష్ట్రంలోని కచ్, భుజ్ వంటి జిల్లాల్లో సంభవించినభూకంపం సృష్టించిన పెను నష్టాన్ని ఆయన మరిచిపోలేదని తివారీ చెప్పారు. ఆ నాటి భూకంపంలో 13000 మందికి పైగా మరణించారన్నారు.
బహుశా ఇది తలుచుకునే ఇప్పుడు టర్కీ పరిస్థితిపై మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయినట్టు కనిపిస్తోందన్నారు. టర్కీలో మంగళవారం కూడా స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. శిథిలాల్లో గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలను, గాయపడి ఉన్నవారిని సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.