ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాల్లో ఉండడంతో.. మోడీ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అయి చర్చలు జరిపారు. అమిత్ షా, రాజ్‌నాథ్, అజిత్ దోవల్ సహా పలువురు పాల్గొన్నారు.
ఇతర దేశాలతోపాటు భారత్ తోనూ తాము మంచి సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఈమధ్యే తాలిబన్లు ప్రకటించారు. తర్వాత దోహాలోని రాయబార కార్యాలయంలో భారత రాయబారి మిట్టల్ తో సమావేశమయ్యారు. భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా ఉండాలనే అంశంపై చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆఫ్ఘాన్ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఆ దేశం విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు, అధికారులతో చర్చించినట్లు సమాచారం.