ఓవైపు ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 300 మార్క్ దాటేశాయి. రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆంక్షల వలయాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితి, ఒమిక్రాన్ ప్రభావంపై అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని మోడీ. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి హోంశాఖ, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వోతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ముప్పుపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ వార్ రూమ్స్‌ను యాక్టివేట్ చేయాలని.. అవసరమైతే కరోనా ఆంక్షలను కఠినతరం చేయాలని, నైట్ కర్ఫ్యూలు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు పండుగలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్ సర్కార్ అయితే ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రానప్పటికీ ఓ అడుగు ముందుకేసి వైరస్ కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, కర్నాటకలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. తెలంగాణలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది.