ఈశాన్య రాష్ట్రాలను బీజేపీ ‘అష్ట లక్ష్మీ’లుగా భావిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. నాగాలాండ్‌లో శాశ్వత ప్రాతిపాదికన శాంతి నెలకొల్పేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఓ ఏటీఎంలాగా ఉపయోగించుకుందని ఆరోపించారు.
రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే 1958 నుంచి కొనసాగుతున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేశామని ఆయన తెలిపారు. తమ సొంత ప్రజలను విశ్వసించకుండా, వారిని గౌరవించకుండా, సమస్యలను పరిష్కరించకుండా దేశాన్ని నడపలేమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు ఉండేవని ఆయన చెప్పారు. ప్రజలను మతం, ప్రాంతం ఆధారంగా తమ పార్టీ విభజన చూపదన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నియంత్రించిందని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు రాజవంశ రాజకీయాలను నడిపిందని మండిపడ్డారు.
నాగాలాండ్ ను నడిపేందుకు ఎన్డీయే ప్రభుత్వం మూడు సూత్రాలను అవలంభిస్తోందన్నారు. శాంతి, పురోగతి, శ్రేయస్సు అనే మూడు మంత్రాల ద్వారా నాగాలాండ్ ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అవినీతికి బీజేపీ చెక్ పెట్టిందన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే డబ్బుల నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.