గిరిజనుల సంక్షేమం తన వ్యక్తిగత ధ్యేయమని, ఇది తన సెంటిమెంటుతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. సామాన్య పౌర జీవనానికి సుదూరంగా ఉన్న ఆదివాసీలు, గిరిజనులను కూడా నగరాలకు దగ్గర చేయడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన చెప్పారు. గిరిజన సంస్కృతిని హైలైట్ చేసేందుకు ఢిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఆది మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 21 వ శతాబ్దంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న మంత్రంపై ఈ దేశం నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండాకు ఆయన ఘనంగా నివాళి అర్పించారు.
గత తొమ్మిదేళ్లలో ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాలు ఈ దేశానికి ప్రచారంగా మాత్రమే ఉపయోగపడుతూ వచ్చాయని, అలాంటి పలు ఈవెంట్లలో తాను పాల్గొన్నానని చెప్పిన ఆయన.. ఇప్పుడు గిరిజన సంక్షేమమన్నది తన వ్యక్తిగత సెంటిమెంటుతో ముడిపడినదిగా మారిందన్నారు. ఇదివరకటి ప్రభుత్వాలు వెదురును నరకడం, దాన్ని వినియోగాన్ని లీగల్ గా బ్యాన్ చేశాయని, కానీ తాము వెదురును గడ్డి కేటగిరీలో చేర్చి దీనిపై ఇదివరకున్న అన్ని నిషేధాలను ఎత్తివేశామని మోడీ చెప్పారు. బ్యాంబూతో చేసిన ఉత్పత్తులన్నీ పెద్ద పరిశ్రమలో భాగమయ్యాయన్నారు.
ఆదివాసీలు, గిరిజనులు తయారు చేసిన సాంప్రదాయక వస్తువులకు డిమాండ్ పెరిగిందని, ఈశాన్య రాష్ట్రాల్లో తయారైన ఇలాంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో .. గిరిజనులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను సుమారు 200 స్టాల్స్ లో ప్రదర్శించారు.
ఈ మహోత్సవ్ లో దాదాపు వెయ్యి మంది గిరిజన హస్తకళాకారులు పాల్గొంటున్నారు. ఈ నెల 16 నుంచి 27 వరకు ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. గురువారం మోడీ ఈ స్టాల్స్ ను సందర్శించి కొన్ని ఉత్పత్తుల వివరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.. దీన్ని మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ గా అభివర్ణిస్తున్నారు.