దావూదీ బోహ్రా వర్గం ప్రజలు అభివృద్ధి పరీక్షలో ఎప్పుడూ ధీటుగా నిలుస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ ముంబై క్యాంపస్‌ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా ముస్లింల ప్రధాన విద్యా సంస్థ. బోహ్రా వర్గంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఈ విద్యా సంస్థను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…. తాను అక్కడిగా ప్రధాన మంత్రిగా రాలేదన్నారు. బోహ్రా కుటుంబంలో ఓ సభ్యుడిగా వచ్చానన్నారు. అక్కడికి రావడంతో తన కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లుగా భావిస్తున్నట్టు చెప్పారు.
అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీని ప్రారంభించడం మారుతున్న కాలంతోపాటు జరుగుతున్న అభివృద్ధికి చిహ్నమని ఆయన వెల్లడించారు. కాలంతోపాటు నిరంతరం ప్రగతిని దావూదీ బోహ్రాలు సాధిస్తున్నారని తెలిపారు. ఆకాంక్షల వెనుక సదుద్దేశం ఉంటే, ఫలితాలు ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఉంటాయన్నారు.
వాళ్లు చేసిన ఓ వీడియో గురించి ఆయన స్పందించారు. ఆ వీడియోను తాను చూశానని చెప్పారు. అయితే వాళ్లపై తనకు ఓ ఫిర్యాదు ఉందన్నారు. వాళ్లు తనను పదే పదే ప్రధాన మంత్రి అని సంభోదిస్తున్నారని చెప్పారు. తాను ప్రధాన మంత్రిని కాదని, వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకన్ని అని అన్నారు.
అది తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. బోహ్రా కుటుంబంతో తనకు నాలుగు తరాలుగా అనుబంధం ఉందన్నారు. ఈ నాలుగు తరాల వారు తమ ఇంటికి వచ్చారన్నారు. ఇది ఇలా వుంటే అణగారిన వర్గాలకు చేరువకావాలని బీజేపీ నేతలకు ఆయన గతవారం పిలుపునిచ్చారు. వారు తమ పార్టీకి ఓటు వేసినా, వేయకపోయినా, వారిని కలవాలని ఆయన సూచించారు.