– వైభవంగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ
– ప్రధాని ప్రత్యేక పూజలు
– మోడీపై చినజీయర్ ప్రశంసల వర్షం
రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని అన్నారు ప్రధాని మోడీ. శంషాబాద్ ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 54 ఫీట్ల ఎత్తున్న భద్రవేది బేస్ పై అమర్చిన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంతకుముందు స్వర్ణ మూర్తికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామానుజాచార్యుల సమతా సూత్రమే మన రాజ్యాంగానికి స్ఫూర్తని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేద్కర్ అని అన్నారు. దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని అయితే.. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మనకు ప్రేరణ అని తెలిపారు.
భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారని కొనియాడారు ప్రధాని. దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని.. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారన్నారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ.. రామానుజాచార్యుల అంతటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తని కొనియాడారు. మోడీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకొని బతుకున్నారని అన్నారు. మోడీ వచ్చాక కశ్మీర్ మన సొంతమైందన్న ఆయన.. ప్రపంచంలో మన దేశాన్ని తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారని ప్రశంసించారు చిన జీయర్ స్వామి.