భారత్‌లో విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఏరో ఇండియా ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధాని మోడీ అన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా-2023 పర్యటను బెంగళూరులోని యల్హంకలో ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో ఇండియా-2023లో ఎయిర్ షోలు, ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకోనుంది.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… సరికొత్త భారత సామర్థ్యాలకు నేడు బెంగళూరు గగనతలం సాక్షిగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ నూతన ఔన్నత్యమే నవభారత సత్యమని బెంగళూరు చాటుతోందన్నారు. నేడు దేశం కొత్త శిఖరాలను తాకుతోందన్నారు.
ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్ వేగా నిలుస్తుందన్నారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతమవుతోందని ఆయన అన్నారు. అత్యంత తక్కువ ఖర్చుతోనే దేశంలో రక్షణ పరికరాలను తయారుచేస్తున్నామని ఆయన వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశంలో విమానాలు తయారుచేసుకుంటున్నామని చెప్పారు.
విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ సామగ్రిని ఆరు రెట్లు పెంచామని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కొత్త పుంతలు తొక్కామని వివరించారు. పరిశ్రమలకు ఇచ్చే అనుమతులను సరళతరం చేశామని ఆయన వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపేట వేశామన్నారు.
భారత్ లో విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఏరో ఇండియా ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ప్రదర్శనలో దాదాపు 100 దేశాలు పాల్గొనడం చూస్తే భారత్ పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చని వెల్లడించారు. దేశం, ప్రపంచం నుంచి 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. గత రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టింది చెప్పారు.
‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు గాను స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇందులో భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 32 దేశాల నుంచి వచ్చిన రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.