గుజరాత్ లో జరుగుతున్న అభివృద్ధి ప్రతి గుజరాతీయున్ని గర్వ పడేలా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. బనాస్ డెయిరీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు సాధికారతను కల్పిస్తాయన్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ క్యాంపెయిన్ ను సహకార ఉద్యమం ఎలా బలోపేతం చేస్తుందో ఇక్కడ మనం చూడగలమన్నారు.
ప్రపంచ పాల ఉత్పత్తిలో ప్రస్తుతం భారత్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. నేడు కోట్లాది మంది రైతుల జీవానాధరం పాలు అని అన్నారు. దేశంలో ఏటా రూ. 8.5 లక్షల కోట్ల విలువ చేసే పాలను ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు.
గత కొన్నేళ్లుగా బనాస్ డెయిరీ స్థానిక కమ్యూనిటీలకు, ముఖ్యంగా రైతులు, మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. చిన్న రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు.