ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మోడీ రాష్ట్ర పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ కు ప్రధాని మంత్రి మోడీ రానున్నారు. దాదాపు రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అలాగే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
వీటితో పాటు కాజీపేట వర్క్ షాప్, సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్ మెంట్, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. రూ.1410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య 85 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన డబుల్ లైన్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
అనంతరం మోడీ రూ.1,850 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. ఆ ఐఐటీ హైదరాబాద్ లో రూ.2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ప్రధాని మోడీ కాజీపేటకు వెళ్లనున్నారు. అక్కడ రూ.521 కోట్లతో నిర్మించనున్న రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపుకు భూమి పూజ చేస్తారు.
హై టెక్నాలజీ హంగులతో వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో వెళ్తుంది. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వయా కాజీపేట మీదుగా వెళ్ళనుంది.