కర్ణాటకలోని శివ మొగ్గలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు. రూ. 450 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ నూతన ఎయిర్ పోర్టు వల్ల మధ్య కర్ణాటక ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగనుంది. ఈ విమానాశ్రయాన్ని పై నుంచి చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది.
అందరికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో దీన్ని ఉడాన్ పథకం కింద నిర్మించారు. ఈ నూతన ఎయిర్ పోర్టు వల్ల ఐటీ, టూరిజం, డెయిరీ రంగాలకు లబ్ది చేకూరుతుందని అధికారులు తెలిపారు. శివ మొగ్గ ఎయిర్ పోర్టు ప్రారంభంతో రాష్ట్రంలో డొమెస్టిక్ విమానాశ్రయాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
రాష్ట్రంలో మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయన కర్ణాటకలో పర్యటించడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ లోపల కలియ తిరిగారు. ఎయిర్ పోర్టు చాలా అందంగా, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
అనంతరం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. శికారిపుర – రాణే బెన్నూరు నూతన రైల్వే మార్గం, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపో ప్రాజెక్టులకు ఆయన పునాదిరాయి వేశారు. శివమొగ్గ – శికారిపుర – రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్‌ను కేంద్రం రూ. 990 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.