దక్షిణాదిన ముఖ్యంగా ఏపీ, తెలంగాణ .. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలపై ‘బీజేపీ మిషన్’ ని చురుకుగా చేపట్టాలని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా ఇదే సందర్భ,లో వైఎస్సార్ టీపీ నేత షర్మిలకు ప్రధాని మోడీ మంగళవారం ఫోన్ చేసి 10 నిముషాలు మాట్లాడినట్టు సమాచారం.
వచ్చేవారం ఢిల్లీలో అందుబాటులో ఉండవలసిందిగా ఆమెకు మోడీ సూచించినట్టు చెబుతున్నారు. ఆ సందర్భంగా షర్మిల మోడీతో బాటు హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కావచ్చునని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ‘ఆపరేషన్ ఫోకస్’ పెట్టినట్టు చెబుతున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాలపై మోడీ .. షర్మిలను అడిగి తెలుసుకున్నట్టు వెల్లడవుతోంది.
నర్సంపేట అనంతర పరిణామాలను షర్మిల .. ఆయనకు వివరించినట్టు తెలిసింది. కారులో ఉండగానే తనను క్రేన్లతో పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్టు చేసిన వైనాన్ని షర్మిల తెలియజేశారని అంటున్నారు. మోడీ ఫోన్ చేశారన్నదే నిజమైతే ‘షర్మిల బాణాన్ని’ బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాలపై ఎక్కుపెట్టడానికి ఈ పరిణామాలను తనకు అనువుగా ఉపయోగించుకోవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె ‘సేవలను’ కాషాయ పార్టీ ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఆమెను తమ రాజకీయ ప్రయోజనాలకోసం బీజేపీ .. ఓ ‘తురుఫు ముక్క’గా వినియోగించుకున్నా ఆశ్చర్యం లేదని తెలిసింది.
నిజానికి షర్మిల పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కావలసి ఉంది. వరంగల్ ఎస్పీ రంగనాథ్ ఇందుకు అనుమతించారు కూడా. కానీ ఈ తాజా పరిణామాల నేపథ్యంలో తన పాదయాత్రకు ఆమె స్వల్ప విరామమిచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణాలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల.. ‘బీజేపీ నుంచి అన్యాపదేశంగా’ వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా అన్నది తేలవలసి ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోవడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని భావిస్తున్నారు. షర్మిలను అరెస్టు చేసిన తీరును బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే ఖండించిన విషయం గమనార్హం.