-కంచు కోటలో జేడీఎస్‌కు చెక్ పెట్టే యోచన
– రంగంలోకి ప్రధాని
-మరో సారి ప్రచారానికి రానున్న మోడీ
– ప్రాంతానికి భారీగా అభివృద్ధి పథకాలు
– కాషాయ నేతల వ్యూహం
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మరోసారి కాషాయ జెండా ఎగుర వేయాలని కమల నాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత కాషాయ నేతలను కలవర పెడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకు రావడం బీజేపీ నేతలకు అతి పెద్ద సవాల్‌గా మారింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అతి ముఖ్యమైన నియోజక వర్గాలపై అగ్రనేతలు దృష్టి సారించారు. ఆయా నియోజక వర్గాల్లో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అవసరమైన చోట ప్రధాని మోడీని కూడా రంగంలోకి దించేందుకు ఇప్పటికే వ్యూహాలు రెడీ చేస్తున్నారు.
కీలకంగా పాత మైసూర్ ప్రాంతం
రాష్ట్రంలో అతి కీలకమైన నియోజక వర్గాల్లో మాండ్యా ఒకటి. పాత మైసూర్ లోని తొమ్మిది జిల్లాల ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. పాత మైసూర్ ప్రాంతంలో 61 నియోజక వర్గాలు వున్నాయి. ఈ ప్రాంతంలో జేడీఎస్ పార్టీకి మంచి పట్టు వుంది. దీంతో పాటు కాంగ్రెస్ కూడా అక్కడ బలమైన ప్రత్యర్థిగా వుంటుంది.
2018 ఎన్నికల్లో కోస్తా కర్ణాటకలో బీజేపీ మంచి ప్రదర్శనను కనబరిచింది. దీంతో ముంబై-కర్ణాటక ప్రాంతం, హైదరాబాద్-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనూ స్పష్టమైన మెజారిటీని సాధించగలిగింది. ఈ సారి పాత మైసూర్ ప్రాంతంలో ఎలాగైనా జేడీఎస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు.
మాండ్యాపై నజర్
2018 ఎన్నికల్లో మాండ్యాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో జేడీఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచిన నారాయణ గౌడ 2109లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019 ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఈ ప్రాంతంలో నారాయణ గౌడ బీజేపీకి తొలి విజయాన్ని అందించారు. ఈ సారి ఎలాగైనా మాండ్యాను చేజిక్కిచ్చుకోవాలని బీజేపీ నేతలు గట్టి పట్టుదలతో వున్నారు.
విజయ సంకల్ప యాత్ర
రాష్ట్రంలోని నలుమూలకు బీజేపీ ప్రచారాన్ని తీసుకు వెళ్లే లక్ష్యంతో విజయ సంకల్ప యాత్రను బీజేపీ నేతలు ప్రారంబించారు. చామ రాజ నగర్ ప్రాంతం నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మోడీ ఇప్పటికే ఓ సారి పాల్గొన్నారు.
రంగంలోకి ప్రధాని
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తన చరిష్మాతో పార్టీకి ప్రధాని మోడీ కీలక విజయాలను అందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి విజయాన్ని బీజేపీకి అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
భారీ ర్యాలీలు.. శంకుస్థాపనలు
విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే ప్రధాని మోడీ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. త్వరలోనే ఆయన మరోసారి మాండ్యలో పర్యటించనున్నారు. ఈయన పర్యటన నేపథ్యంలో మాండ్య ప్రాంతంలో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించాలని, పలు పథకాల ప్రకటనలు చేయించాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా మాండ్యలో జేడీఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది.