ఢిల్లీ లోని ఎయిమ్స్ డాక్టర్లను ప్రధాని మోడీ మనస్ఫూర్తిగా అభినందించారు. ‘భారత డాక్టర్ల అద్భుతమైన అంకిత కృషికి, వారి సామర్థ్యానికి ఇండియా గర్విస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. అత్యంత అరుదైన కేసులో.. ఈ డాక్టర్ల బృందం అతి క్లిష్టమైన, అసాధారణమైన సర్జరీని నిర్వహించింది. ఓ తల్లి గర్భంలోని 28 వారాల పిండంలో అతి చిన్న గుండె రుగ్మతను ఆపరేషన్ ద్వారా నయం చేసింది. బెలూన్ డైలేషన్ పేరిట కేవలం 90 సెకండ్లలో విజయవంతంగా సర్జరీ చేసి వైద్య రంగంలోనే చరిత్ర సృష్టించింది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఈ తరహా సర్జరీ జరగ లేదని, ఇక్కడ జరిగిన ఈ ఆపరేషన్ ఇదే మొదటిదని మోడీ పేర్కొన్నారు.
ఇటీవల 26 ఏళ్ళ గర్భిణీకి మూడు గర్భస్రావాలు జరిగి . తిరిగి గర్భం దాల్చిన ఈమె ఇటీవల ఆసుపత్రిలో చేరిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈమె కడుపులోని శిశువు గుండె బలహీనంగా ఉందని, అందువల్ల ప్రెగ్నెన్సీ విషయంలో మీ నిర్ణయం ఏమిటని తాము ఆమెను, ఆమె భర్తను ప్రశ్నించామని వారు చెప్పారు. కానీ ప్రెగ్నెన్సీ కొనసాగడానికే వారు మొగ్గు చూపడంతో ఆమెకు సుమారు వారం పాటు అన్ని పరీక్షలు చేసినట్టు గైనకాలజిస్టులు వెల్లడించారు.
ఎయిమ్స్ లోని కార్డియోథొరాసిక్ సైన్సెస్ సెంటర్ లో ఈమెకు అంతర్జాతీయ కార్డియాలజిస్టులు, గర్భస్థ పిండ మెడిసిన్ స్పెషలిస్టులు కూడా అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. బెలూన్ డైలేషన్ పేరిట బేబీ గుండెలోని వాల్వ్ ను సరిదిద్దారు. అల్ట్రా సౌండ్ గైడెన్స్ లో ..తల్లి బొడ్డు ద్వారా సూదిని ఆమె గర్భంలోకి పంపి బెలూన్ కేతెటర్ అనే సాధనాన్ని వినియోగించామని, దీంతో బేబీ గుండెలో రక్త ప్రసరణకు అడ్డుగా ఉన్న వాల్వ్ ను తెరచి రక్తం నిరాటంకంగా వెళ్లేలా చేశామని వారు వివరించారు.
90 సెకండ్లలో ఈ సర్జరీ నిర్వహించామని బేబీ జన్మించిన అనంతరం గుండె జబ్బు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రొసీజర్ ఛాలెంజ్ వంటిదని ఓ సీనియర్ డాక్టర్ అన్నారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సైతం ఈ డాక్టర్ల బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇది వీరి ఘనత అని ప్రశంసించారు.