త్వరలో యూపీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. గెలుపు కోసం ఎవరి ప్లాన్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. యోగి సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయనే వార్తలు ఈమధ్య గట్టిగా వినిపించాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ అలీగఢ్ పర్యటన ఆసక్తిని పెంచింది. యోగి పాలనలో యూపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసల జల్లు కురిపించారు మోడీ.
అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. ఈ కార్యక్రమంలో సీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్ సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు మోడీ.
ఒకప్పుడు యూపీలో పాలనంతా గూండాల చేతిలో ఉండేదన్నారు మోడీ. కానీ.. సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టాక రౌడీలందరూ జైళ్లలో ఊచలు లెక్కబెడుతున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు యూపీ ఒక ఆకర్షణగా నిలుస్తోందని వివరించారు. దీనికోసం యోగి ఎంతగానో కష్టపడ్డారని కొనియాడారు. అభివృద్ధికి అడ్డుపడేవాళ్లతో ఆయన పోరాడారని చెప్పుకొచ్చారు.