సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మకర సంక్రాంతి పండుగనాడు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న ఈ దేశీయ అధునాతన వందే భారత్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది తెలుగు ప్రజలకు వందే భారత్ కానుక అని, మారుతున్న దేశ భవిష్యత్ కు ఇదొక ఉదాహరణ అని ఆయన చెప్పారు. అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలు సౌకర్యం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని అన్నారు.
‘2023 లో ప్రారంభిస్తున్న ఇది.. తొలి వందే భారత్ రైలు.. హైదరాబాద్-వరంగల్-విజయవాడ-విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ఈ ట్రెయిన్ సాగుతుంది.. తెలంగాణకు సంబంధించి రైల్వే బడ్జెట్లో రూ. 250 కోట్లకు మించి ఇచ్చేవారు కాదు.. , కానీ తాము 3 వేల కోట్లను కేటాయిస్తున్నాం’. అని మోడీ చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసానిశ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు, ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఈ రైలు ప్రత్యేక వేళల్లో నడవనుంది.
ఉదయం పదిన్నర గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన ఈ రైలు చర్లపల్లి, భువనగిరి,జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, తదితర ప్రాంతాల గుండా సాగి రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 16 వతేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటు లోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు సర్వీసులను నిర్వహిస్తారు.