తల్లి హీరాబెన్ మృతి చెందినా.. ఆ బాధలో కూడా ప్రధాని మోడీ తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. శుక్రవారం వర్చువల్ గా బెంగాల్ లో వందే భారత్ రైలును ప్రారంభించిన ఆయనకు సీఎం మమతా బెనర్జీ .. ఇంత విచారకరమైన తరుణంలోనూ మీరు మీ కర్తవ్యాన్ని విస్మరించలేదన్నారు. ఈ రోజున కూడా మీరు మీ విధులను నిర్వర్తించిన తీరు నిజంగా అభినందనీయం అన్నారు.
తల్లికి ప్రత్యామ్న్యాయం లేదని, మీ అమ్మ తనకు కూడా అమ్మేనని ఆమె వ్యాఖ్యానించారు. తన వర్చ్యువల్ ప్రసంగంలో మోడీ.. వందేమాతరం నినాదంతో వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నామని అన్నారు. 1943 లో నేతాజీ చంద్రబోస్ అండమాన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రోజునే ఇక్కడ వందే భారత్ రైలు ప్రారంభమైందన్నారు.
రైల్వే వ్యవస్థ ఆధునీకరణ కోసం కేంద్రం భారీగా పెట్టుబడులు పెడుతుందన్నారు. బెంగాల్ లో 25 కొత్త మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేబట్టామని.. వీటిలో ఇప్పటికే 11 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు.
నదులు కలుషితం కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను కోరుతున్నామన్నారు. ప్రపంచం మొత్తం ఇండియాపై గొప్ప విశ్వాసంతో ఉందన్నారు. దీని కోసం ప్రతి భారతీయుడు కృషి చేయాలన్నారు. జోకా-తరటాలా ప్రాంతాలను కలిపే మెట్రో రైలును ఆయన వర్చ్యువల్ గా జెండా ఊపి ప్రారంభించారు.