రైతుల సంక్షేమం కోసం మరో బృహత్తర కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే… 35 రకాల నూతన వంగడాలను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అభివృద్ధి చేసింది. కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.
వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. వాతావరణానికి తగ్గట్లు కొత్త రకాల విత్తనాలను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న ఈ సమయంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మోడీ. 35 రకాల విత్తనాల గురించి వివరిస్తూ… రైతులతో మాట్లాడారాయన. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులే లబ్దిపొందేలా చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. డైరెక్టుగా రైతులకు ప్రయోజనం చేకూర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మోడీ.