రానున్న ఐదేండ్లలో 75 మున్సిపాలిటీల్లో గోబర్ దాన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆసియాలోనే అతి పెద్ద బయో సీఎన్ జీ ప్లాంట్ ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ‘గోబర్ దాన్’ గా పిలుస్తున్న ఈ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్మించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…
‘ రాబోయే రెండేండ్లలో దేశంలో 75 మున్సిపాలిటీల్లో గోబర్ దాన్ బయోసీఎన్ జీలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. దేశంలోని నగరాలను కాలుష్యరహితంగా, నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఈ క్యాంపెయిన్ దోహదపడుతుంది” అని అన్నారు.
దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ 8శాతానికి చేరుకుంది. బ్లెండింగ్ ప్రక్రియ కోసం ఇథనాల్ ను సరఫరా చేసే ప్రక్రియ గత ఏడేండ్లలో విపరీతంగా పెరిగింది అని తెలిపారు.
‘ ఇటీవల పంట వ్యర్థాలకు సంబంధించి ఈ బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నాము. పంట వ్యర్థాలను థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉపయోగించాలని నిర్ణయించాము. దీంతో పంట వ్యర్థాలకు సంబంధించి రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా దీంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది” అని వెల్లడించారు.