జీ7 దేశాల అధినేతలకు ప్రధాని మోడీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. యూపీలో అమలవుతున్న ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ పథకంలో భాగంగా తయారు చేసిన ప్రత్యేక కళాత్మకమైన వస్తువులను వారికి బహుమతిగా ఇచ్చారు. వీటిలో ఒక్కో బహుమతిని ఒక్కో దేశ నేత కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.
వారణాసిలో ప్రత్యేకంగా స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన మీనాకరి బ్రోచ్ ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మోడీ ప్రెజెంట్ చేశారు. దీని మీద అత్యంత అందగా నగిషీలు చెక్కారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బ్రోచ్‌కు మ్యాచ్ అయ్యేలా జో బైడెన్ కోసం కఫ్‌లింక్స్‌ను రూపొందించారు.
ప్లాటీనం హ్యాండ్ పెయింటెడ్ టీ- సెట్ ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ప్రధాని మోడీ అందజేశారు. యూపీలోని బులుంద్ షహర్ లో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఏడాది బ్రిటన్ రాణి ఎలిజబెత్ ప్లాటీనం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఆమె గౌరవార్ధం ఈ టీ-సెట్‌కు ప్లాటినం పెయింట్ వేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కు లక్నోలో తయారు చేసిన క్యారియర్ బాక్స్ ను బహుమతిగా ఇచ్చారు. ఖాదీ పట్ట వస్త్రంపై చేతితో అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జరీ జర్దోసీ బాక్స్ ను, దానితో పాటు ఫ్రెంచ్ జాతీయ పతాకంలో గల మూడు రంగులతో కూడిన శాటిన్ టిష్యూను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ బాక్సులో అత్తర్ మిత్తి, జాస్మిన్ ఆయిల్, అత్తర్ షమామా, అత్తర్ గులాబ్, ఎగ్జోటిక్ మస్క్, గరమ్ మసాలాలు కూడా ఉన్నాయి.
జర్మన్ ఛాన్స్ లర్ ఓలఫ్ షోల్జ్ కు మరోడీ మెటల్ తో పూత పూసిన ప్రత్యేకమైన మట్కా, నికెల్ కోటింగ్‌తో కూడిన కంచు బిందె, మొరాదాబాద్ లో తయారు చేసిన ప్రత్యేకమైన కంచు పాత్రలను గిఫ్ట్ గా అందజేశారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదకు నిజామాబాద్ లో తయారు చేసిన మట్టి పాత్రలను ఇచ్చారు. దీనిలోపలికి ఆక్సిజన్ ప్రవేశించకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పాత్రలో వేడి వస్తువులు ఉన్నప్పుడు వాటి వేడి స్థాయి ఎక్కువగా ఉండేలా ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు కశ్మీరులో చేతితో అల్లిన ప్రత్యేకమైన పట్టు తివాచీని బహూకరించారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు ఉంది.
ఇటలీ ప్రధాని మంత్రి మారియో డ్రఘికి ప్రత్యేకంగా రూపొందించిన మార్బుల్ ఇన్‌లే టేబుల్ టాప్‌ను ఆయన బహూకరించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు డోక్రా ఆర్ట్, సెనగల్ దేశ అధ్యక్షుడికి మూంజ్ బాస్కెట్స్, కాటన్ డర్రీలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు వారణాసిలో తయారు చేసిన లాక్వర్ వేర్ రామ్ దర్బార్ ను బహూకరించారు.